ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా ఎల్లో బ్యాచ్ డ్రామాలకు తెరపడింది. సానుభూతి కోసం జగన్ ఆ దాడి చేయించుకున్నారని చంద్రబాబు సహా టీడీపీ నాయకులు డ్రామాలు ఆడుతూ వచ్చారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా మహేశ్వర రావు పాత్ర కూడా రాయి దాడిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి టీడీపీ బీసీ సెల్ నాయకుడు దుర్గారావు ప్రేరేపించినట్లు వెలుగు చూసింది.
బోండా ఉమాకు సతీష్ సన్నిహితుడని, జగన్‌పై దాడి చేస్తే డబ్బులు ఇస్తానని దుర్గారావు సతీష్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత తప్పించుకుని పారిపోయిన సతీష్ డబ్బుల కోసం దుర్గారావుకు ఫోన్ చేశాడని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాత దుర్గారావు ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. దీంతో టీడీపీ నేతల కుయుక్తులకు తెరపడింది.
దాడి జరిగిన తర్వాత బోండా ఉమా మాట్లాడిన తీరుకు, ఆ తర్వాత మాట్లాడిన తీరుకు చాలా తేడా ఉంది. అన్నా క్యాంటీన్లు మూసేసినందుకు ఆగ్రహంతో ఓ యువకుడు దాడి చేశాడని చెప్పిన ఉమా ఆ తర్వాత కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాకలు తీరిన నాయకుడినని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా నాలుక మడతపెట్టారు. బోండా ఉమాను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
గులకరాయి దాడి అని అంటూ.. జగన్ డ్రామాలు ఆడుతున్నారని చులకన చేసే ప్రయత్నం చేశారు. కానీ పక్కా ప్రణాళిక ప్రకారం జగన్ మీద టీడీపీ దాడి చేయించిందని పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో టీడీపీ ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రలైనా చేస్తుందని అర్థమవుతోంది.