ముస్లిం మైనారిటీల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటనా అనేది ఇప్పుడు తేల్చుకోవాల్సిన విషయం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు అదే బాటలో నడుస్తారని అర్థం చేసుకోవాలి. బీజేపీని గానీ, ప్రధాని మోదీని గానీ ఆయన వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. పైగా, ప్రధానిపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీలను చంద్రబాబు దగా చేయడానికి సిద్ధపడినట్లే భావించాలి. దగా చేస్తారు కూడా. మోసం చేయడం అనేది ఆయన రక్తంలోనే ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదనంతా ముస్లింలకు, చొరబాటుదార్లకు పంచి పెడుతుందని ప్రధాని మోదీ రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో అన్నారు. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు చొరబాటుదార్లకు చేతుల్లోకి పోతుంది, దాన్ని మీరు అంగీకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలను మోదీ చొరబాటుదార్లుగా, అధిక సంతానం కలిగినవారిగా చిత్రీకరించారు.
కాంగ్రెస్ను విమర్శిస్తూ.. వారు మీ మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టరన్నారు. తాము అధికారంలోకి వస్తే తల్లుల, అక్కాచెల్లెళ్ల బంగారాన్ని లెక్క కట్టి దాన్ని పంచిపెడుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ను మోదీ విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ముస్లిం మైనారిటీల పట్ల ఆయన వైఖరి ఏమిటో అర్థమవుతూనే ఉంది. ముస్లిం మైనారిటీల పట్ల మోదీ వైఖరినే చంద్రబాబు అనుసరిస్తారు తప్ప అందుకు భిన్నంగా వ్యవహరించలేరు.
సీఏఏ, యూసీసీ, ముస్లిం కోటా వంటి అంశాలపై నోరు మెదపని చంద్రబాబు.. మోదీ మాటలపై మాట్లాడుతారని ఆశించడం భ్రమే అవుతుంది. ముస్లిం మైనారిటీలను చంద్రబాబు మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లింల జీవితాలు ఏమవుతాయో, వారి పట్ల ఎంతటి వివక్ష కొనసాగుతుందో చెప్పనలవి కాదు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను కాపాడుతానని, వారికి అండగా ఉంటానని చెప్పుతున్న మాటల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు. అయినా, అయనలో నిజాయితీ ఉందని అనుకోవడమే పెద్ద భ్రమ.