చేతికి ఎముకే లేనట్లుగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన మంగళవారం కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. అయితే, మేనిఫెస్టో కవర్ మీద బీజేపీ నేత ఫొటో లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఫొటోలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశంలో లేరు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును బీజేపి చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు వదిలేసినట్లు కనిపిస్తోంది.
అయితే, తాము రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలను విడుదల చేయడం లేదని, జాతీయ స్థాయిలో మాత్రమే విడుదల చేస్తున్నామని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. తమకు బీజేపీ మద్దతు పూర్తిగా ఉందని చంద్రబాబు చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా అమలు చేస్తారనే విషయాన్ని చంద్రబాబు చెప్పలేదు. సంపద సృష్టించి ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎంత సంపద సృష్టించినా ఆ హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అరచేతిలో స్వర్గం చూపించినట్లుగానే ఉన్నాయి.
చంద్రబాబు ఇచ్చిన హామీలను పేర్కొంటూ వాటికయ్యే ఖర్చును లెక్కలు వేస్తూ పోతే గుడ్లు తేలేయాల్సిందే. జగన్ సంపద సృష్టించలేదని అందుకే చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా అదే. ఆచరణసాధ్యమైన హామీలు మాత్రమే జగన్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం అలవికాని హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేస్తారనే నమ్మకం ఆయన కలిగించగలరా? లేదు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టదాఖలు చేశారు. అలా బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఎన్ని హామీలైనా ఇవ్వగలరు.
వైఎస్ జగన్ కన్నా ఎక్కువ పథకాలను ప్రకటిస్తే, ఎక్కువ నగదును చూపిస్తే ప్రజలు నమ్మేసి తనకు ఓట్లు వేస్తారని చంద్రబాబు భావించి ఉంటారు. అందుకే ఎవరికీ సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. దానికి పవన్ కల్యాణ్ తల ఊపారు. కానీ చంద్రబాబు కల నెరవేరే అవకాశం లేదు. చంద్రబాబు మోసపూరిత వైఖరిని ప్రజలు ఎప్పుడో పసిగట్టారు.