పేద పిల్లల చదువులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాగంలా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు ద్వారా మెరుగుపరుస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో పేద పిల్లల కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చోటు కల్పించలేదు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు దీటుగా పేద వర్గాల పిల్లలను తయారు చేసే పథకాలకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాని ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటిన సందర్భాలూ ఉన్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను కూడా కాపీ కొట్టి కూటమి మేనిఫెస్టోను రూపొందించారు. కానీ జగన్ అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలను చంద్రబాబు వదిలేశారు. పిల్లల మీద డబ్బులు పెడితే ఏం లాభమని అనుకున్నారో, చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు దోచిపెట్టాలనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకున్నారో తెలియదు గానీ విద్యకు సంబంధించిన అతి ప్రధానమైన కార్యక్రమాలను చంద్రబాబు ప్రస్తావించలేదు.
పేద పిల్లల పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపు కూడా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలను వదిలేయడానికి కారణం కావచ్చు. పేద కుటుంబాల తల్లిదండ్రులు ఈ విషయంలో ఆలోచించకుండా చంద్రబాబును నమ్మితే నట్టేట మునిగినట్లే.
చంద్రబాబు అధికారంలోకి వస్తే కింది పథకాలు ఉండవనేది స్పష్టంగా తెలిసిపోతోంది.
- పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు.
- నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు.
- ఐబి సిలబస్ ఉండదు.
- పౌష్టికాహారం పెట్టె గోరుముద్ద ఉండదు.
- కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి పేద పిల్లలను తయారు చేయడానికి ఇచ్చే విద్యా కానుక ఉండదు.
- 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ లు ఇవ్వరు.
- ఇంగ్లీష్ లో బాగా రాణించేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఉండవు.
చంద్రబాబు బ్యాచ్ మొదటి నుంచి ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకంగానే ఉంది. అందువల్ల ఆయన అధికారంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియం విద్యకు స్వస్తి చెప్పే అవకాశాలున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడే నిరుపేదల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం కార్పొరేట్ విద్యాసంస్థలను ఆశ్రయించాల్సి వస్తుంది. చేతకాకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరా వసతులతో తెలుగు మీడియం చదివించుకోవాలి.