ఆంధ్రప్రదేశ్లో హత్యారాజకీయాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీ నేతలే టార్గెట్లో దాడులకు తెగబడుతోంది. టీడీపీ దాడులు వైసీపీ వరకే పరిమితం కాలేదు.. సొంత పార్టీ నేతలను సైతం చంపుకునేంత వరకు వెళ్లాయి. ఆగస్టు 14వ తేదీన పత్తికొండ నియోజకవర్గం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఇది వైసీపీ నేతల పనేనని, హోసూరులో టీడీపీ మెజార్టీని తట్టుకోలేక వైసీపీ నేతలు కిరాతకంగా హత్య చేశారని టీడీపీ తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా `వైకాపోన్మాదం` అనే టైటిల్ పెట్టి మరీ లోకేష్, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పార్టీపై బురదజల్లారు.
కాగా, టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులును సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనువాసులుకు సొంత పార్టీలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆ పార్టీలోని పలువురు హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
శ్రీనివాసులు హత్యను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ అనుకూల మీడియా కూడా నానా హంగామా సృష్టించింది. మరి పోలీస్ విచారణలో టీడీపీ నేతలే శ్రీనివాసులును మట్టుబెట్టినట్లుగా తేలింది. దీనిని మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి.