సూపర్-6 స్కీమ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన పగ్గాలు చేపట్టిన రెండున్నర నెలలకే వాటిని అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పథకాల అమలుకు డబ్బులు లేవని ప్రకటించగా, కింది స్థాయి నేతలు సైతం అంతకు మించి వ్యవహరిస్తున్నారు. తాజాగా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చంద్రబాబు అనవసరంగా సూపర్ సిక్స్ స్కీములు పెట్టారని, ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయొద్దని చంద్రబాబుకి చెప్పాను అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రజలకి డబ్బులు వేస్తే బయటికి వెళ్లి బిర్యానీలు తిన్నారు. దాంతో ఇంట్లోని ఆడవాళ్లు వంట చేయడం మానేశారని, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా దుస్తులు కొనుక్కుంటున్నారని, ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అధికారంలోకి వచ్చి 75 రోజులు అయినా.. సూపర్-6లో ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడానికి అసలు కారణం ఇదేనా..? అని వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోను పోస్టు చేసి మరీ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. మరి దీనిని చంద్రబాబు, అధికార పార్టీ నేతలు సమర్థించుకుంటారా..?
సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం అమలు దిశగా అడుగులు వేయలేదు. పెన్షన్లు మాత్రమే వెయ్యి పెంచి ఇస్తున్నప్పటికీ, వాటిలోనూ ఏరివేత మొదలైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అనేక పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినప్పటికీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.