అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో నిన్న మధ్యాహ్నం రియాక్టర్ బ్లాక్ అయ్యింది. పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు హఠాత్తుగా నేలకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 18కి చేరింది. 41 మంది క్షతగాత్రులు విశాఖ, అనకాపల్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంపై ఒక రిపోర్టు తయారు చేశారు. సాల్వెంట్ కెమికల్ వల్లే ప్రమాదం జరిగిందని, కంపెనీ నిర్లక్ష్యం వల్లే పేలుడు సంభవించిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనకు దిగాయి. పేలుడు ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, కంపెనీ ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నోరుమెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో కలెక్టర్, బంధువుల మధ్య ఏకాభిప్రాయం కుదురకపోవడంతో మృతదేహాలతో మృతుల కుటుంబీకులు విశాఖ కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. పరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోటి పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ చెబుతున్నప్పటికీ బాధితుల బంధువుల్లో నమ్మకం లేదు. ఈరోజున్న మాట పరిహారం ఇచ్చే సమయంలో ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. పరిహారం ఇచ్చాకే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ ఏ విధంగా ఆదుకున్నారోజ.. అదే తరహాలో పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రూ.కోటి చొప్పున కంపన్సేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు ఆస్పత్రి నుంచి కదిలేది లేదని మృతదేహాలతో భీష్మించుకుర్చున్నారు. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకోనున్నారు. మరి ఆయన మృతులతో పాటు గాయపడిన వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోనున్నారో, వారి కోపాన్ని ఏ విధంగా చల్లార్చనున్నారో వేచి చూడాలి.