ఇంటి గుట్టు కాస్త రచ్చకెక్కింది. ఏళ్లుగా అనుభవిస్తున్న పదవి పోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిగా తయారైంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి. గత పదిహేను రోజులుగా దువ్వాడ శ్రీను, ఆయన భార్య వాణి, దివ్వెల మాధురి మధ్య వివాదం కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్-మాధురిలు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని వాణి తన కూతురితో కలిసి శ్రీను ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గత పదిహేను రోజులుగా దువ్వాడ ఇంటి ఆవరణలోనే కారు షెడ్‌లో పడుకుంటూ శ్రీను-మాధురిల బంధాన్ని బయటపెట్టింది. దీంతో మాధురి కూడా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఇద్దరి సంబంధంపై క్లారిటీ ఇచ్చింది. వాణి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని సూసైడ్ కూడా చేసుకోబోయింది.
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన వివాదం రచ్చకెక్కి పోలీస్ కేసులు, కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లడంతో వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి శ్రీనును తప్పిస్తూ ఆదేశాలిచ్చింది. కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దువ్వాడ శ్రీను దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.
దువ్వాడ వాణి స్థానిక జడ్పీటీసీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి వాణి అభ్యర్థిత్వం ఖాయమైనప్పటికీ ఆఖరి నిమిషంలో తన భర్తకు అవకాశం వచ్చింది. టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీ చేసి శ్రీనివాస్ ఓడిపోయారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. దువ్వాడ వ్యవహారం పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తోందని భావించిన పార్టీ అధిష్టానం.. శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. కుటుంబ వ్యవహారం కాస్తా దువ్వాడ పొలిటికల్ కెరీర్‌పై ప్రభావాన్ని చూపినట్టు అయ్యింది.