ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఇష్టారీతిగా రెచ్చిపోతున్నారు. మొన్న వినుకొండలో రషీద్ హత్య, నిన్న తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి, తాజాగా పోలీస్ స్టేషన్లోనే మహిళపై చెప్పుతో దాడి. స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం.
చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు జయచంద్రారెడ్డి చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన భవిత, సురేష్ దంపతులకు కొంతకాలంగా ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఆ దంపతులను ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిపించాడు జయచంద్రారెడ్డి. వారిని బెదిరించి, ఇష్టారీతిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు చంద్రబాబు పోలీసులను ఆశ్రయించారు. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు సైతం ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో బాధితులు ఎస్పీ దగ్గరకు వెళ్లారు. ఎస్పీ ఆదేశాలతో సీఐ బాధితులను పీఎస్‌కు పిలిపించి విచారణ ప్రారంభించారు. బాధితులకు సహాయంగా వారి బంధువు చంద్రమ్మతో సహా పలువురు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
సీఐ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత జయచంద్రారెడ్డి సీఐ ముందే బాధితులను బెదిరిస్తూ అభ్యకర పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే బాధితులకు సాయంగా వచ్చిన ఓ మహిళను సీఐ సమక్షంలోనే చెప్పుతో కొట్టాడు. ఈ ఘటన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సద్దుమణిగేలా చేసేందుకు ఎమ్మెల్యే నాని అనుచరులు రంగంలోకి దిగారు. వారు స్టేషన్లో సీసీ ఫుటేజీ మాయం చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల ఎదుటే ఓ మహిళకు ఇంతటి ఘోరమైన అవమానం జరగడంతో సామాన్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పీఎస్‌లో మహిళలను చెప్పుతో కొడితే మహిళా కమిషన్ ఏం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.