ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టయి.. తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కవిత తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీం కోర్టులో ముకుల్ రోహత్గీ వాదించారు. ఈడీ తరఫున ఏఎస్‌జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ మంజూరైంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో 153 రోజులుగా ఆమె తీహార్ జైల్లో గడిపారు.
కవిత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా పలువురు నాయకులు కోర్టుకు హాజరయ్యారు.