మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌లో సంచలన రాజకీయాలకు పెట్టింది పేరైన తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాకే ఆయన కారు దిగినట్లు సమాచారం. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డాక్టర్ నుంచి ఉపముఖ్యమంత్రి స్థాయికి
మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాటికొండ రాజయ్యకు వైద్యుడిగా మంచి పేరుంది. ఆయనే కాదు ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు అందరూ డాక్టర్లే. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున అప్పటి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచారు. కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. అయితే ఆయన వ్యవహారశైలి నచ్చని కేసీఆర్ ఆయన్ను పదవిలో నుంచి దింపేశారు. ఈ అంశం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనమైంది.
రకరకాల ఆరోపణలతో రచ్చరచ్చ
రాజయ్యపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణలే. ఆయన నియోజకవర్గంలోని ఓ మహిళా సర్పంచి.. రాజయ్య తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ ప్రెస్‌మీట్లు చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కలేదు. అయితే గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసిన రాజయ్య ఇప్పుడు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.