వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. రెండు చోట్లా సహాయక చర్యలు జరుగుతున్నా.. తెలంగాణలో ప్రభుత్వంపై విమర్శలు కాస్త ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో మంత్రులను తిడుతున్న వీడియోలు, బాధితుల ఆక్రందనలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి అధికారులను అలర్ట్ చేశారు. వరద పరామర్శకు బయలుదేరారు.
https://x.com/revanth_anumula/status/1830500169210618045
వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షలు సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారుల సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాల్లోని కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అనునిత్యం ప్రజల్ని అలర్ట్ చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో తక్షణం అంచనాలు మొదలు పెట్టి బాధితుల్ని ఆదుకోవాలన్నారు. వర్షాలకు పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు మొదలు పెట్టాలన్నారు. విద్యుత్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందించాలని కూడా విన్నవించారు రేవంత్ రెడ్డి. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ఖమ్మం జిల్లాను సందర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. సూర్యాపేట జిల్లాలో కూడా పలు ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. ఈరోజు రాత్రికి ఖమ్మంలోనే బస చేస్తారు సీఎం, రేపు మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు.
తెలంగాణలో వర్షాలు, వరదలకు జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. వర్షాలతో టీజీఎస్ఆర్టీసీ 1400 బస్సు సర్వీసుల్ని రద్దు చేసింది. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే బస్సుల్ని ఆపివేసింది. ఖమ్మం జిల్లాకు కొన్ని బస్సుల్ని పునరుద్ధరించగా, విజయవాడ బస్సుల్ని గుంటూరు మీదుగా దారిమళ్లించారు.