YouTube channel subscription banner header

కృష్ణమ్మ కోపం కాదు.. బుడమేరు మిగిల్చిన విషాదం

Published on

బెజవాడ జలదిగ్బంధం అంటే కృష్ణమ్మ కన్నెర్ర చేసిందని నిర్థారణకు వచ్చేస్తారంతా. కానీ ఈసారి కృష్ణానది కంటే బుడమేరు ప్రమాదకరంగా మారింది. విజయవాడలో జలవిలయానికి కారణం అయింది. బుడమేరు తన విశ్వరూపాన్ని చూపెట్టడంతో సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, విజయవాడ వన్ టౌన్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. బుడమేరుని తక్కువగా అంచనా వేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆక్రమణలు పెరిగిపోవడం, కరకట్టలు ధ్వంసం కావడం, బుడమేరు పరీవాహక ప్రాంతంలో కొత్త కాలనీలు ఏర్పాటు కావడంతో వరదనీరు పోటెత్తి నివాస గృహాలు నీటమునిగాయి.

ఖమ్మం జిల్లాలోని మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు బుడమేరు. ఇది 170 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరులో కలసిపోతుంది. కొల్లేటికి నీటిని అందించే ప్రధాన వనరు బుడమేరు. ప్రతి ఏటా సగటున 10నుంచి 11వేల క్యూసెక్కుల నీరు బుడమేరులో ప్రవహిస్తుంటుంది. భారీ వర్షాలు, వరదల సమయంలో ఇది మరింత పెరుగుతుంది. అప్పుడే ప్రమాదం ముంచుకొస్తుంది. 2005, 2009లో కూడా ఇదే జరిగింది. ఈసారి కూడా బుడమేరే విజయవాడను ముంచింది. ఈసారి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.

బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద దాదాపు 40ఏళ్ల క్రితం రెగ్యులేటర్‌ నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ నుంచి.. బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తుంది. బుడమేరు వంపుల వల్ల వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నష్టం జరుగుతుందని తేల్చిన నిపుణులు 2005లో డైవర్షన్ పనులు మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ పనులు ఆగిపోయాయి. ఇక కరకట్ట కూడా చాలా చోట్ల ధ్వంసమైంది, నివాస సముదాయాలు ఏర్పాటయ్యాయి. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని అంటున్నారు. వాగు ప్రవాహ మార్గంలో చాలా ఆక్రమణలున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటివి బుడమేరు పరీవాహక ప్రాంతంలోనివేనంటున్నారు.

బుడమేరు నీటిని తీసుకునే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురికావడం, ఇటు బుడమేరు పరీవాహక ప్రాంతం కబ్జాలపాలు కావడంతో వరదలు వస్తే ఊహించని నష్టం జరుగుతోంది. బుడమేరు వరదని ముందుగా అంచనావేసి ఉంటే ముంపు ప్రాంతాలవారిని అలర్ట్ చేసేవారు, పునరావాస కేంద్రాలకు తరలించేవారు. కానీ ఒక్కసారిగా ఇళ్లన్నీ మునిగిపోయాక ప్రభుత్వం సీన్ లోకి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తాజాగా జగన్ కూడా బుడమేరుని ట్రెండింగ్ లోకి తెచ్చారు. బుడమేరు గేట్లు ఎత్తివేసి విజయవాడను ముంచేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే అధికారులు ఈ పని చేశారన్నారు. అయితే చంద్రబాబు ఇల్లు కరకట్టకు అవతలివైపు ఉంటుందని, బుడమేరు కృష్ణా నదికి ఇవతలి వైపు ఉంటుందని మ్యాప్ లు చూపించి మరీ జగన్ వ్యాఖ్యల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు బుడమేరుకి గేట్లే లేవని సీఎం చంద్రబాబు కూడా జగన్ ని ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద ఈ పాపమంతా బుడమేరు ఖాతాలో పడిపోయింది. వర్షాలు, వరదలు తగ్గాక.. ఆక్రమణలు తొలగించి నష్టనివారణ చర్యలు చేపడితేనే.. భవిష్యత్తులో బుడమేరు ఆగ్రహించినా బెజవాడ వణికిపోకుండా ఉంటుంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...