ఏపీ వరదల్లో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుండగా మరోవైపు నాగబాబు ట్వీట్లతో హడావిడి చేస్తున్నారు. ఆమధ్య వృద్ధులకు పెన్షన్లు పంచుతూ ఫొటోలకు ఫోజులిచ్చిన నాగబాబు.. వరదల సమయంలో జనంలోకి మాత్రం రాలేదు. కానీ ట్విట్టర్లో జగన్ పై పంచ్ లు పేలుస్తున్నారు. జగన్ ని ఒకటో తరగతి పిల్లాడుగా పేర్కొంటూ తాజాగా ఓ ట్వీట్ వేశారు నాగబాబు.
https://x.com/NagaBabuOffl/status/1830854215683690835
వరద పరామర్శకు వచ్చిన జగన్ ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ చేసిన కామెంట్లపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. అసలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అది కాదని, మూడేళ్ల క్రితం 2021లో అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడం మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పారు నాగబాబు. అప్పట్లో 44 మంది చనిపోయారని, 15 మంది జాడ తెలియలేదని, 5 ఊళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, వందలాది పశువులు చనిపోయాయని ఆయన వివరించారు. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుకని అక్రమంగా తరలించేవారని, ఇసుక కోసం వచ్చిన లారీలు వెళ్లిపోయే వరకు నీరు కిందకు వదలకుండా ఆపారని, ఆ తర్వాత ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి చెప్పారని కూడా నాగబాబు తన ట్వీట్ లో ప్రస్తావించారు.
జగన్ హయాంలో డ్యామ్ గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారని చెప్పారు నాగబాబు. వీలైతే ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుందని జగన్ కి ఆయన సలహా ఇచ్చారు. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేయాలని హితవు పలికారు నాగబాబు.