ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతల కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు రువ్వారు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ల కార్లతో పాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతం BK నగర్లో వరద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు.. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
https://x.com/BRSparty/status/1830907180410622319
బీఆర్ఎస్ నేతల కార్లపై దాడి చేసింది తుమ్మల నాగేశ్వర రావు అనుచరుడు మిక్కిలినేని నరేందర్ అని చెప్పారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఇలాంటి చిల్లర పనులు బంద్ చేయాలని సూచించారు. దాడి వెనుక కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేకుంటే వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈ దాడులన్నారు జగదీశ్ రెడ్డి.
అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మృతుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారన్నారు. 16 మంది చనిపోయారని రేవంత్ చెప్తున్నారని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. సూర్యాపేటలో సాగర్ కెనాల్ తెగడానికి కూడా పూర్తిగా సర్కార్ నిర్లక్ష్యమే కారణమన్నారు హరీష్ రావు. ఖమ్మం జిల్లాకు నీటిని తరలించేందుకు లాక్‌లకు వెల్డింగ్ చేసి వదిలేశారని, తర్వాత వెల్డింగ్ తొలగించలేదన్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లుగా ఒక్కొక్కరికి రూ.25 లక్షలు పరిహారం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు హరీష్ రావు. NDRF బృందాలు రాష్ట్రానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే రాష్ట్రానికి ఇచ్చింది జీరో అన్నారు. కనీసం ఒక్క హెలికాప్టర్‌ను సైతం పంపలేకపోయారన్నారు. కేంద్రం ప్రభుత్వం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీష్ రావు.