సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించారు. ఇవాళ వరదలకు ప్రకృతి వైపరీత్యం కంటే ఆక్రమణలే ప్రధాన కారణమన్నారు. ఆక్రమణలకు ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా హైడ్రాను తీసుకువచ్చి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. FTL, బఫర్ జోన్లతో పాటు నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నామన్నారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలనే డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మంత్రుల, అధికారులతో కలిసి వరదలపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
https://x.com/TeluguScribe/status/1830916396248858725
హైడ్రా కేవలం హైదరాబాద్ కోసం తీసుకువచ్చిన వ్యవస్థ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే చెరువులు, కుంటలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని అధికారులకు సూచించారు. కోర్టుల నుంచి పర్మిషన్ తీసుకుని కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు.
గడిచిన పదేళ్లలోనే ఆక్రమణలు భారీగా జరిగాయన్న రేవంత్ రెడ్డి.. ఖమ్మం జిల్లాలో కాలువను మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమించారన్న ఫిర్యాదులు వచ్చాయని, వాస్తవాలు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హైడ్రాను జిల్లాలకు విస్తరించాలనే డిమాండ్ ప్రజల నుంచి సైతం బలంగా వినిపిస్తోంది. జిల్లా కేంద్రాల్లో చెరువులను, కాలువలను ఆక్రమించి నిర్మించిన బిల్డింగ్స్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హైడ్రాను జిల్లా కేంద్రాలకు తీసుకురావాలని వినతి పత్రాలు అందించారు.