విజయవాడలో వరద బాధితులకు చంద్రబాబు వరాలు ప్రకటించారు. వరద తగ్గిన తర్వాత ప్రతి ఇంటిలోని బురదను ప్రభుత్వమే శుభ్రం చేయిస్తుందని హామీ ఇచ్చారు. ఫైరింజన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లిస్తామని, ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అంతే కాదు.. బైక్ లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నీ శుభ్రం చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు చంద్రబాబు. వాటి ఇన్సూరెన్సు క్లెయిమ్ లు కూడా 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్స్ తో, ఇన్సూరెన్సు కంపెనీలతో మాట్లాడతామని భరోసా ఇచ్చారు. చిరు వ్యాపారుల్ని ఆదుకుంటామన్నారు.
https://x.com/JaiTDP/status/1831027403839410585
ఇంటివద్దకే ఆహారం..
పునరావాస కేంద్రాలనుంచి తిరిగి ఇళ్లకు వచ్చినా కూడా వరద బాధితులకు ఇంటి వద్దకే ఆహరం, నీరు పంపిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఏ ఒక్కరూ రోడ్డుపైకి రావాల్సిన అవసరం లేదన్నారాయన. మెడికల్ క్యాంప్స్ మొదలు పెడుతున్నామని, కరెంటు సరఫరా కూడా పునరుద్ధరిస్తామన్నారు. జేసీబీ ఎక్కి దాదాపు 22 కిలోమీటర్ల మేర దానిపై ప్రయాణిస్తూ వరద బాధితుల్ని పరామర్శించారు చంద్రబాబు. భవానీపురం, జక్కంపూడి, వాంబేకాలనీ, అంబాపురం తదితర ప్రాంతాల్లో ఆయన బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
https://x.com/JaiTDP/status/1831025635894116584
పరామర్శల అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు ప్రాంతాల్లో ప్రజలు సహాయ కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. కొంతమంది అధికారులు సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ఆహార పంపిణీ జరగాలని, ఏ ఒక్కరూ తమను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదు చేయకూడదన్నారు. అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. అధికారులు మరింత బాధ్యత, భయంతో పని చేస్తారనే తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని తెలిపారు చంద్రబాబు.
https://x.com/JaiTDP/status/1831024368358756449
పనిలో పనిగా గత ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో పూడికలు తీయలేదని, ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. వాటన్నిటినీ తొలగిస్తామన్నారు. రాజకీయ పార్టీలకు ఉండాల్సిన లక్షణాలేవీ వైసీపీకి లేవన్నారు. రౌడీల్ని, గూండాల్ని పెట్టుకుని రాజకీయం చేశారని, ఏపీలో నేరాలు, ఘోరాలు చేశారని మండిపడ్డారు.