రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేశాయి. ఏపీలో విజయవాడ, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. నిత్యవసర సరుకుల కోసం ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అందరికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళం ప్రకటించారు. తర్వాత మెగా ఫ్యామిలీ, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, బాలకృష్ణ సహా చాలా మంది స్టార్స్ విరాళాలు ప్రకటించారు.
తాజాగా ఈ లిస్ట్‌లోకి హీరో నాగార్జున వచ్చి చేరారు. N – కన్వెన్షన్ కూల్చివేతతో గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు నాగార్జున. దీంతో సోషల్‌మీడియాలో నాగార్జునకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళమిస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొందామంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని N- కన్వెన్షన్‌ను కూల్చివేయడంతో నాగార్జున వార్తల్లో నిలిచారు. తుమ్మిడికుంట చెరువు FTL పరిధిలో నిర్మించారన్న కారణంతో N- కన్వెన్షన్‌ను కూల్చివేసింది హైడ్రా. ఐతే నాగార్జున తనది ఆక్రమణ కాదని, పట్టా భూమి అని వివరణ ఇచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టేటస్‌కోకు ఆదేశాలు జారీ చేసింది.