వరద ప్రబావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరదనీరు తగ్గుతోంది. ఇళ్లనుంచి బురద తొలగించుకుంటున్నారు స్థానికులు. అయితే ఇంట్లోని ఆహారపదార్థాలేవి తినడానికి పనికొచ్చేలా లేవు. వారికోసం ప్రభుత్వం నిత్యావసరాల కిట్ లు అందుబాటులోకి తెస్తోంది. ఒక్కో కిట్ లో 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు వంటనూనె, 2 కేజీల బంగాళదుంప, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీ చక్కెర ఉన్నాయి. వీటితోపాటు సబ్సిడీపై కూరగాయలు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రభుత్వం తరపున ట్రాక్టర్లలో కూరగాయలు తెచ్చి అమ్ముతున్నారు. మొబైల్ మార్కెట్ల ద్వారా రూ.2, రూ.5, రూ.10 ధరలకు కూరగాయలు విక్రయిస్తారు. ప్రతి ఇంటికీ పాలు, బిస్కెట్లు, మంచినీరు ఉచితంగా అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు.
https://x.com/JaiTDP/status/1831384146243207206
ఒక్కో ఇంటిది ఒక్కో దీనగాధ అన్నట్టుగా ఉంది పరిస్థితి. చిరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయారు. వ్యాపారం కోసం తెచ్చిన సామగ్రి అంతా వరదపాలైపోయింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, బట్టల షాపుల వారు కూడా పూర్తిగా నష్టపోయినట్టే. నివాస గృహాలకు సంబంధించి గోడలు నానిపోయాయి, ఫర్నిచర్ పనికిరాకుండా పోయింది. నగదు, సర్టిఫికెట్లు తడిచిపోయాయి. టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, ల్యాప్ టాప్ ల వంటివి పాడైపోయాయి. మళ్లీ కొత్తగా జీవితం ప్రారంభించాల్సినట్టుగా ఉంది వారి పరిస్థితి. వీరందరికీ ప్రభుత్వం తరపున సాయం చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. చిరు వ్యాపారులకు అండగా నిలబడతామన్నారు. వాహనాలకు సంబంధించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేలా చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
https://x.com/JaiTDP/status/1831383553482826109
ఫైర్ ఇంజన్ల సాయంతో కొన్నిచోట్ల ఇళ్లను శుభ్రపరుస్తున్నారు. మరికొందరు ఎవరిసాయం లేకుండా సొంతగా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఒక్కో ఫైరింజన్ ద్వారా రోజుకు 250-300 ఇళ్లను శుభ్రం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 50 ఫైరింజన్లు పని మొదలుపెట్టాయని, మరో 50 వాహనాలను ఇతర ప్రాంతాలనుంచి తెప్పిస్తున్నారు. మరోవైపు మంచినీటి ట్యాంకర్లను కూడా విజయవాడకు రప్పిస్తున్నారు.
వరద ప్రభావం తగ్గినా, కొన్నిచోట్ల ఇంకా నీరు నిలిచే ఉంది. మరోవైపు వర్షం కొనసాగుతుండటంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న ఆందోళన నెలకొంది. బుడమేరుకి మళ్లీ వరద వస్తోందనే వార్తలు కూడా ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎలాంటి వరదముప్పు లేదని ప్రభుత్వం చెప్పడం విశేషం. వరదనీటిలో కొట్టుకొస్తున్న శవాలు ప్రమాద తీవ్రతకు అద్దంపడుతున్నాయి. ప్రాణ నష్టం లెక్కలు అప్పుడే తేలేలా లేవు. ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంది. నష్టం అంచనాకు కేంద్ర బృందం రంగంలోకి దిగింది. కేంద్రం అందించే సాయం ఎంతనేది తేలాల్సి ఉంది.