ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోలో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మావోయిస్ట్ లు చనిపోయారు. మృతిచెందిన వారు లచ్చన్న దళానికి చెందినవారిగా గుర్తించారు. మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయన దళానికి చెందిన ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ఈ ఘటనలో గాయపడ్డారు.
కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులతో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. పక్కా సమాచారంతోనే అక్కడికి వెళ్లిన పోలీసులు మావోయిస్ట్ లు కాల్పులు మొదలు పెట్టడంతో ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్ కీలక నేతలతోపాటు ఆరుగురు మరణించారు.
చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో కొన్నిరోజులుగా పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9మంది మావోయిస్ట్ లు మృతి చెందారు. ఆ తర్వాత కొంతమంది తెలంగాణ ప్రాంతంవైపు వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. తాజాగా కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటనలో ఆరుగురు మావోయిస్ట్ లు మరణించారు.