మహిళలను గౌరవించేలా పిల్లలను తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలపై గౌరవమనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలో చూపించాలని చెప్పారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. మహిళల గౌరవాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టే విధంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యతని స్పష్టం చేశారు. ఏ సమాజ అభివృద్ధికైనా అక్కడి మహిళల స్థితిగతులే కీలక ప్రమాణమని చెప్పారు. విద్యార్థుల్లో సున్నితత్వం, నిజాయితీని పెంపొందించడంతోపాటు వారిని ఔత్సాహికులుగా మలచడం ఉపాధ్యాయుల కర్తవ్యమని వివరించారు.
ప్రజలు కారుణ్యం, నైతికత అలవర్చుకోవాలని ముర్ము చెప్పారు. ఇతరుల సంక్షేమం కోసం పనిచేయడంలోనే జీవితానికి అర్థం ఉందని తెలిపారు. ఈ విలువలను ముందు తరాలను అందించడం ఉపాధ్యాయుల విధి అని చెప్పారు. బోధన అనేది మానవ వికాసానికి సంబంధించిన పవిత్ర కార్యమని, పిల్లల్లో సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించాలి కోరారు. గొప్ప ఉపాధ్యాయులు.. గొప్ప దేశాన్ని నిర్మించగలరని, మన టీచర్లు దేశాన్ని ప్రపంచ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తారనే విశ్వాసం ఉందని ముర్ము అన్నారు.