తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామని, ఆయన పేరుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖరారు చేశారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించిన రేవంత్ రెడ్డి పనితీరుని అభినందిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలనుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ హడావిడిగా నిర్ణయం తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికలను కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సమన్వయం చేశారు. ఇప్పుడు అధ్యక్షుడి మార్పు అనివార్యంగా మారింది. దీంతో తీవ్ర తర్జన భర్జనల అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆ స్థానానికి ఎంపిక చేశారు. రేవంత్ రెడ్డికి సీఎం సీటు ఇవ్వడం, డిప్యూటీ సీఎం పోస్ట్ దళిత నాయకుడైన భట్టి విక్రమార్కకు ఇవ్వడంతో పీసీసీ స్థానం బీసీకి ఖరారైంది.
NSUI నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్, NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1998-2000 మధ్య ఇండియన్ యూత్ కాంగ్రెస్ కి సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత పీసీసీ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను తెలంగాణ పీసీసీ పీఠం వరించింది.