రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సాయంపై గందరగోళం నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల కోసం కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల చేసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిందనేది రూమర్ మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ కేంద్రానికి నివేదిక కూడా పంపలేదన్నారు చంద్రబాబు. రేపు ఉదయం కేంద్రానికి తొలి నివేదిక ఇస్తామన్నారు చంద్రబాబు.
https://x.com/TeluguScribe/status/1832072258652713222
అంతకుముందు బుడమేరు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు గండ్లను పూడ్చే పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ కూడా వచ్చిందని, శనివారం నాటికి బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర కిట్ల పంపిణీని రేపటి నుంచి వేగవంతం చేస్తామన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురందేశ్వరి మరోలా ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు నిధులు విడుదల చేసిందంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించినందుకు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఓ వైపు చంద్రబాబు ఎలాంటి నిధులు విడుదల కాలేదని చెబితే…బీజేపీ నేత పురందేశ్వరి నిధులు విడుదలయ్యాయంటూ ట్వీట్ చేయడం గందరగోళానికి దారి తీసింది.