వర్షాల భయం తప్పింది కానీ, వరద భయం మాత్రం బెజవాడ వాసుల్ని కలవరపెడుతోంది. ఇటీవల నీటమునిగిన ప్రాంతాల్లో మళ్లీ వరదనీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బుడమేరులో నీటిమట్టం పెరగడంతో ఆ నీరు మళ్లీ లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి చేరుతోంది. విజయవాడ సిటీలోని సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, విజయవాడ రూరల్ లోని అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం గ్రామాల్లో రెండు అడుగుల వరకు నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని సురక్షిత ప్రాంతాలకు, బంధువుల వద్దకు వెళ్లిపోయారు. నీటిమట్టం అంతకంటే పెరగదని, భయపడొద్దని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజలు మాత్రం కలవరపడుతున్నారు.
బుడమేరు నీటి ప్రవాహం పెరిగినా, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎలాంటి వరద లేదని అధికారులు అంటున్నారు. కాలనీల్లోకి చేరిన వరదనీరు ఈరోజు(శనివారం) మధ్యాహ్నానికి తగ్గే అవకాశముందని అంటున్నారు. అటు బుడమేరు డైవర్షన్ ఛానల్ కు కూడా వరద ప్రవాహం చాలావరకు తగ్గిపోయింది. దీంతో ముప్పు లేదని అధికారులు ధీమాగా చెబుతున్నారు. కానీ పెరుగుతున్న నీటిమట్టం ప్రజల్ని కుదురుగా ఉండనీయడం లేదు. వరద సాయం, నిత్యావసరాల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది.
విజయవాడలో నీటమునిగి ప్రాంతాల్లో పరిస్థితి కాస్త చక్కబడినా.. బుడమేరు ఉధృతికి గన్నవరం, నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో వరద పెరిగింది. పొలాలు, రోడ్లు నీటమునిగాయి. ఆయా మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. విజయవాడను చుట్టుముట్టిన వరద నీరు బుడమేరు డ్రెయిన్ లోకి వెళ్లిపోతోంది.
వరదనీరు పూర్తిగా తగ్గకపోవడంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బురదతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు ముమ్మరం చేసింది. ఆహార పదార్థాల సరఫరాతోపాటు, అత్యవసర మందులు కూడా పంపిణీ చేస్తోంది.