బెజవాడను ముంచిన బుడమేరు వాగుకి పడ్డ గండ్లను పూడ్చివేశారు జలవనరుల శాఖ అధికారులు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడి వరదనీరు పోటెత్తగా 6 రోజులపాటు శ్రమించి వాటిని పూడ్చివేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ పనుల్ని పర్యవేక్షించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి మరీ మంత్రిని అభినందించారు. ఈ గండ్లు పూడ్చడం వల్ల లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం తొలగిపోయుందని అన్నారు మంత్రి నిమ్మల.
https://x.com/JaiTDP/status/1832363658631913729
ఇటీవల భారీ వర్షాలకు బుడమేరు డైవర్షన్ ఛానెల్ కు గండ్లు పడ్డాయి. మొత్తం మూడు గండ్లు పడగా.. అక్కడినుంచి వరదనీరు పొలాలను ముంచెత్తింది, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఓవైపు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి, మరోవైపు బుడమేరు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు అధికారులు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ ఈ పనుల్ని పర్యవేక్షించారు. వర్షంలో తడుస్తూ పనులు చేయిస్తున్న మంత్రి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://x.com/JaiTDP/status/1832291573075472838
వరద ఉధృతంగా ఉన్నప్పుడే రెండు గండ్లు పూడ్చేశారు. మూడో గండి పూడ్చే సమయానికి వరద కూడా తగ్గడంతో పని సులభంగా మారింది. మూడో గండి వద్ద పూడ్చివేతకు ఆర్మీ జవాన్లు కూడా సాయం చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ కు చెందిన జవాన్లు 120 మంది ఇక్కడికి వచ్చి గండ్లు పూడ్చివేసే పనుల్లో పాల్గొన్నారు. ఈ పని విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొన్నారని ఆయన ప్రశంసించారు.