ఏపీ వరద నష్టాలకు సంబంధించి సీఎం చంద్రబాబుని దోషిగా చిత్రీకరిస్తూ ఘాటు ట్వీట్ వేశారు వైసీపీ అధినేత జగన్. 8 పాయింట్లను ముఖ్యంగా ఆయన ప్రస్తావించారు. వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయన్నారు. వరదలకన్నా చంద్రబాబు నిర్వాకం వల్ల, ఆయన అసమర్థత వల్ల వచ్చిన నష్టమే ఎక్కువని తేల్చారు జగన్. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఐదారు లక్షలమందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇది చంద్రబాబు చేతగాని తనం అని, ఆయన అమానవీయతకు ఇదే నిదర్శనం అని మండిపడ్డారు.
https://x.com/ysjagan/status/1832436985270604218
మూడు రోజుల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం అనేది అసాధారణమేమీ కాదన్నారు జగన్. గతంలో చాలాసార్లు ఈ స్థాయిలో వర్షం పడిందని, కానీ ఇప్పటిలాగా 50మందికిపైగా ప్రజలు చనిపోవడం ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందన్నారు. వర్షాలు ఆగిపోయి నాలుగైదు రోజులవుతున్నా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం దారుణం అని అన్నారు జగన్.
అడుగడుగునా నిర్లక్ష్యం..
ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు వస్తాయని, వరదలొస్తాయని.. అంతకు 2 రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించిందని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరిగిందని అన్నారు జగన్. కృష్ణా ప్రాజెక్ట్ లన్నీ నిండు కుండలుగా ఉన్న వేళ.. వర్షాలు, వరదల హెచ్చరికలు వచ్చినప్పుడు ఆ నీటిని కిందికి విడిచిపెట్టాలన్న స్పృహ ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. తీరా వరదలు వచ్చాక హడావిడి చేశారని, అందుకే భారీగా నష్టం జరిగిందన్నారు జగన్.
ఓ పద్ధతి ప్రకారం, సమీక్షలు నిర్వహించి విడతల వారీగా నీటిని విడుదల చేసి ఉంటే ఈ ప్రమాదం తప్పేది అని అన్నారు జగన్. పోనీ వరదలొచ్చాకయినా ప్రభుత్వం అలర్ట్ అయిందా అంటే అదీ లేదన్నారు. పునరావాసంపై దృష్టి పెట్టలేదని చెప్పారు. వాలంటీర్లు ఉండి ఉంటే, సచివాలయ సిబ్బందిని సరిగా ఉపయోగించుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు జగన్. దీనికితోడు కూటమి నేతల ప్రచార ఆర్భాటం వల్ల కూడా పనులు ముందుకు సాగలేదన్నారాయన. సహాయక చర్యల్లో సమన్వయ లోపం ఉందని, సీఎం చంద్రబాబు – మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య జరిగిన సంభాషణే దీనికి నిదర్శనం అన్నారు. వరద బాధితులకు అందిస్తున్న సరకులు కూడా అరకొరగానే పంపిణీ చేశారన్నారు. బాధితుల్లో ఏ ఒక్కరికిని కదిపినా దీనగాథలు వినిపిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షం బలంగా నిలబడుతుందని, వైసీపీ పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు జగన్.