74 ఏళ్ల వయసులో తన తండ్రి సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం చేస్తున్నారని, అలాంటి నాయకుడ్ని విమర్శించడానికి మీకు మనసెలా వచ్చిందంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ జగన్ వేసిన ట్వీట్ కి కౌంటర్ గా లోకేష్ కొన్ని ఫొటోలతో ట్వీట్ పెట్టారు. జగన్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు.
https://x.com/naralokesh/status/1832669125958578391
ప్రతిపక్ష నాయకుడి హోదా డిమాండ్ చేస్తున్న జగన్ కి ఆ హుందాతనం ఉందా అని ప్రశ్నించారు లోకేష్. సీఎం చంద్రబాబుపై ఆయన అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన జగన్ ఇప్పుడు బెంగుళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ కూడా జగన్ ఇచ్చేవారు కాదని, ఆ చరిత్ర వారికి లేదన్నారు లోకేష్. జగన్ ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనన్నారు.
బుడమేరు ఆధునీకరణకు గతంలో చంద్రబాబు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని, జగన్ వచ్చాక పనులు నిలిపివేశారని చెప్పారు లోకేష్. ఆ పనులు ఆగిపోవడమే ఇప్పుడు విపత్తుకి ప్రధాన కారణంగా మారిందన్నారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగనేనంటూ ట్వీట్ వేశారు లోకేష్. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని తేల్చి చెప్పారు. బుడమేరు ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేసిన వైసీపీ నేతలు 600 ఎకరాలు కబ్జా చేశారని, 2022 లోనే బుడమేరుకి గండి పడినా పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఇప్పుడు బుడమేరు పొంగిందని చెప్పారు. జగన్ పాలనా వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలకు కారణం అన్నారు లోకేష్.