వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్ వసూలు చేయాలన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో చంద్రబాబు సర్కార్ వెనక్కి తగ్గింది. తాజాగా ఈ విషయంపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. తాను జగన్ ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవోనే చదివానంటూ వైసీపీపై నెపం నెట్టేశారు అనిత. గతంలో వినాయక మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తీసుకోవాలంటే రెండు, మూడు చోట్లకు వెళ్లాల్సి ఉండేదని, తాము సింగిల్ విండో విధానం తీసుకొచ్చామని చెప్పారు.
10 రోజుల క్రితం తాను మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు అనిత. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని.. ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఫీజు కలెక్ట్ చేయట్లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఐతే మంత్రి ప్రకటనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. చాలా మంది తాము ఇప్పటికే మండపాల ఏర్పాటుకు, మైక్ సెట్ కోసం డబ్బులు కట్టామని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి చలాన్లను సోషల్మీడియాలో పెడుతున్నారు.
అంతకుముందు గణేష్ మండపాల్లో మైక్ పర్మిషన్తో పాటు విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలన్న హోం మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత సైతం ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమిలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నానని చెప్పారు మాధవీలత. ప్రతి వాళ్లకూ హిందువుల పండగలపై పడి ఏడవడం తప్పా మరో పని లేదా అంటూ ప్రశ్నించారు. ఇదే రూల్ క్రిస్టియన్, ముస్లిలంకు పెట్టండి అంటూ ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.