ఆమధ్య కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి భారీ విధ్వంసం జరిగింది. గతంలో ఎప్పుడూ ఎరగని విపత్తుని వయనాడ్ కళ్లజూసింది. సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు వైజాగ్ లో కనపడుతున్నాయి. ఆ స్థాయి తీవ్రత లేకపోయినా కొండచరియలు విరిగిపడటం వల్ల ఇళ్లు నేలమట్టం కాబోతున్నాయి. విశాఖలోని గోపాలపట్నంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
గోపాలపట్నం ఏరియాలో కొంతమంది కొండ వాలు ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడ మట్టి కొట్టుకుపోతోంది. కొండ చరియలు విరిగి పడగా.. మట్టి, రాళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. పెద్ద పెద్ద భవంతులన్నీ నేలమట్టం కాబోతున్నాయి. స్థానికులు భయాందోళనలతో ఇళ్లు ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు.
వైజాగ్ లోని రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. గోపాలపట్నంలో చాలా ఇళ్లు కొండవాలు ప్రాంతంలోనే ఉంటాయి. ప్రమాదకరం అని తెలిసినా కూడా ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఉపద్రవాలు లేకపోవడంతో ధైర్యంగా అక్కడ బిల్డింగ్ లు కట్టారు. కొండదిగువన కూడా పెద్ద సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో మట్టి కొట్టుకుపోతోంది. భవంతుల పునాదులు బయటపడుతున్నాయి. కొండ వాలు వద్ద ఉన్న ఇళ్లతోపాటు కింద ఉన్న ఇళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.