సిక్స్ గ్యారెంటీస్ అమలయ్యాయా..? అసలు అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే.. గ్యారెంటీగా చెప్పకపోయినా చాలా కార్యక్రమాలను పట్టాలెక్కించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చూపించిన దారిలో వెళ్లాలని ఆయన అనుకోవట్లేదు. కాస్త కఠినమైనా కొత్త మార్గంలోనే వెళ్తున్నారు. దీనికి తాజా నిదర్శనమే హైడ్రా. విమర్శలొస్తున్నా, చివరకు అది తన పదవికే ఎసరు పెట్టే ప్రమాదం ఉందని తెలిసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. తాజాగా ఆయన తెలంగాణ జర్నలిస్ట్ ల చిరకాల కోరిక నెరవేర్చారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి లబ్ధిదారులకు భూమి స్వాధీన పత్రాలు అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లపాటు ఈ విషయంలో ముందడుగు వేయలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 9 నెలల్లోనే జర్నలిస్ట్ ల చేతికి స్వాధీన పత్రాలు అందాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/revanth_anumula/status/1832717620769870304
రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్ట్ లకు భూమి స్వాధీన పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అని చెప్పారాయన. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిందని తెలిపారు. గతంలో జర్నలిస్ట్ లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇళ్ల స్థలాలు కేటాయించారని.. అప్పుడు, ఇప్పుడు జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. వ్యవస్థల్లో జర్నలిజం ఒక భాగం అని ఆ వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే తమ ఆలోచన అని అన్నారు రేవంత్ రెడ్డి.
గత అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులను రానివ్వలేదని, జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించకూడదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ సభ్యులకు నేడు న్యాయం జరిగిందని, మిగతా జర్నలిస్ట్ సంఘాలకు కడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జర్నలిస్ట్ సంఘాలకు ప్రయారిటీ ప్రకారం స్థలాలు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలంటున్నారు.