ఏపీలో వరద నష్టం రూ.6,882 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో ప్రజల వద్ద మరింత సమాచారం సేకరించిన అనంతరం కచ్చితమైన లెక్కలు తెలుస్తాయని, నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రాథమిక నివేదిక పంపించింది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించింది.
రోడ్లు భవనాల శాఖకు రూ.2,165 కోట్ల నష్టం
జలవనరుల శాఖకు రూ.1,569 కోట్లు
పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు రూ.1,160 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ.12 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు
మత్స్య శాఖకు రూ.158 కోట్లు
ఉద్యానవన శాఖకు రూ.40 కోట్లు
విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు
గ్రామీణ నీటి పారుదల శాఖకు రూ.76 కోట్లు
పంచాయితీరాజ్ పరిధిలోని రోడ్లకు రూ.168 కోట్లు
అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్రం లెక్క తేల్చింది. తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు రూ.6,882 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 2.32 లక్షల కుటుంబాలకు చెందిన 7.04 లక్షల మంది బాధితులుగా మారారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విజయవాడలోని 32 వార్డులతోపాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారని తేల్చింది. భారీవర్షాలు, వరదల కారణంగా మొత్తం 45మంది మరణించారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో మృతుల సంఖ్య 35కు చేరింది. గల్లంతైన ఒకరి ఆచూకీ ఇంకా లభించలేదు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాల్లో ఇద్దరు మరణించారు. విజయవాడ నార్త్‌లో 10మంది, విజయవాడ రూరల్ పరిధిలో ఎనిమిది మంది చనిపోయారు. మొగల్రాజపురం, జి.కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లో కూడా వరదల్లో చిక్కుకుని స్థానికులు మృతి చెందారు.