కృష్ణా నది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది, అటు ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితులు చక్కబడుతున్నాయి, తాజాగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ లంక గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద మరింత పెరిగితే వెంటనే వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తామని చెప్పారు.
ఎగువన భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గినా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహ ఉధృతి ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి.. నదీ పాయల్లో వరద పోటెత్తింది. పి.గన్నవరం మండలం ఏనుగుపల్లిలంక, శివాయిలంక, నాగుల్లంక చుట్టూ వరదనీరు చేరింది. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాలు కూడా ముంపుబారిన పడ్డాయి. పశ్చిమ గోదావరిజిల్లా కనకాయలంక, అయోధ్యలంక, రావిలంక గ్రామాల ప్రజలకు రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది. వారి రాకపోకలకు ఇప్పుడు పడవలే ప్రధాన ఆధారం అయ్యాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పుష్కర రేవులను వరదనీరు ముంచెత్తింది.
మరోవైపు సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాకినాడ జిల్లా రాజుపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. వరదలతో నష్టపోయిన వారి కుటుంబాలకు ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరికి ఎకరాకు రూ.10 వేలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ దుస్తులు, వంట సామగ్రి కోసం రూ.10 వేలు తక్షణ సాయం చేస్తామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటినీ ప్రభుత్వమే తిరిగి నిర్మిస్తుందని, వాహనాలకు కూడా పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.