ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బుధవారం కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇంతకీ వివాదం ఏంటి!
అరికెపూడి గాంధీని PAC ఛైర్మన్గా నియమించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన PAC ఛైర్మన్ పదవిని BRS నుంచి కాంగ్రెస్లో చేరిన గాంధీకి ఎలా ఇస్తారంటూ గులాబీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐతే దీనిపై స్పందించిన గాంధీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ తనకు దేవుడి కండువా మాత్రమే కప్పారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఐతే గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. తాను గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని, ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పారు. అనంతరం గాంధీని తెలంగాణ భవన్కు తీసుకువస్తామంటూ కామెంట్స్ చేశారు.
https://x.com/TeluguScribe/status/1834081647987146849
ఐతే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు అరికెపూడి గాంధీ. 11 గంటల కల్లా తన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేయకపోతే.. 12 గంటలకల్లా మేము కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తామంటూ ఈ వీడియోలో చెప్పారు గాంధీ. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టించారని, కేసీఆర్ను నాశనం చేశారని ఆరోపించారు. తన యుద్ధం బీఆర్ఎస్తో కాదని, కౌశిక్ రెడ్డితో మాత్రమేనని చెప్పారు. దమ్ముంటే రా అంటూ సవాల్ చేశారు. తనకు పోలీసు బందోబస్తు కూడా అవసరం లేదన్నారు.