గంజాయ్ డోర్ డెలివరీ. ఇదెక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే వ్యవహారం కాదు. మన తిరుపతిలోనే జోరుగా సాగుతున్న వ్యాపారం. అవును, తిరుపతి టౌన్ లో కొన్నాళ్లుగా గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మనోడు ఆల్రడీ డోర్ డెలివరీలో ఎక్స్ పర్ట్. స్విగ్గీలో డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. సైడ్ బిజినెస్ గా గంజాయి కూడా డోర్ డెలివరి చేస్తున్నారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా స్విగ్గీ బ్యాగ్ లో గంజాయి పొట్లాలు పెట్టుకుంటాడు. తిరుపతిలో తనకు ఫోన్ చేసి గంజాయి కావాలని అడిగిన వారికి ఇంటికెళ్లి మరీ ప్యాకెట్ ఇచ్చి వస్తాడు. స్విగ్గీ బ్యాగ్, ఐడీకార్డ్ ఉండటంతో పోలీసులకు కూడా అనుమానం రాలేదు. పక్కా సమాచారంతో నిఘా ఉంచి అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి 22కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి పేరు సత్తుపతి శ్రీనివాసరావు. ఊగు నగరి మండలం ఓజీ కుప్పం. తిరుపతిలోని మారుతీనగర్‌లో ఉంటూ స్విగ్గీ డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై అక్రమ సంపాదనను ఎంచుకున్నాడు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి గంజాయి తీసుకొచ్చే బ్యాచ్ తో పరిచయం పెంచుకున్నాడు. వారి ద్వారా కేజీ రూ.10వేలకు కొనుగోలు చేసి, దాన్ని 10గ్రాములు, 20 గ్రాముల ప్యాకెట్లుగా విడగొట్టి కేజీకి దాదాపు రూ.20వేలు లాభం సంపాదించేవాడు. స్విగ్గీ డెలివరీ బాయ్ అనే జాబ్ ఉంది. అక్రమ సంపాదన కూడా బాగుండడంతో వ్యాపారాన్ని విస్తరించాడు. చివరికిలా పోలీసులకు దొరికాడు.