డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో శుక్రవారం పర్యటించనున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఏలేరు వరద ఉద్ధృతి కారణంగా అతలాకుతలమైన గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది వైసీపీ. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్న జగన్ పిఠాపురం చేరుకుంటారు. ముంపు గ్రామాలైన మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేటలో బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. ఏలేరు కాలువకు గండి పడిన ప్రాంతాలతో పాటు నీట మునిగిన పంటలను జగన్ పరిశీలించనున్నారు.
భారీ వర్షాల కారణంగా ఏలేరు కాలువకు గండిపడి గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లోని పలు గ్రామాలు వరదల బారినపడ్డాయి. ఏలేరు కాలువకు గండ్ల కారణంగా దాదాపు 25 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దాదాపు 23 గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఏలేరుతో పాటు అనుబంధ పంట కాలువలకు పది చోట్ల గండ్లు పడ్డాయి.
సొంత నియోజకవర్గం పిఠాపురంను వరదలు ముంచెత్తితే పవన్‌కల్యాణ్ ఒక్కరోజు మాత్రమే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. బాధితులకు భరోసా కూడా కల్పించలేదు. ఇక జగన్ పిఠాపురం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురంలోనే ముగించారు జగన్. మళ్లీ పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటించడం ఇదే తొలిసారి.