హైడ్రా చట్టబద్ధతపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నోటీసులు లేకుండా కూల్చివేతలేంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా విషయంలో ప్రభుత్వం మరింత పగడ్బందీగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు అభ్యంతరాలకు సమాధానం ఇస్తూనే హైడ్రాకు అదనపు అధికారాలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైడ్రాకోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్ తేబోతోందని కమిషనర్ రంగనాథ్ స్వయంగా చెప్పడం విశేషం.
జీవో 99 ప్రకారం జులై 19న హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి, రంగనాథ్ ను కమిషనర్ గా నియమించారు. నెలల వ్యవధిలోనే హైడ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా హీరో నాగార్జున కు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా వార్తల్లోకెక్కింది. సీఎం రేవంత్ సోదరుడి భవనాలకు, టీడీపీ నేత మురళీ మోహన్ సంస్థకు నోటీసులిచ్చి సరిపెట్టిన హైడ్రా, నిరుపేదల ఇళ్లు, కొంతమంది విల్లాలను మాత్రం నోటీసుల్లేకుండా కూల్చేసింది. కోర్టు స్టే విధించినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఈ దశలో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు హైడ్రా ఉనికిని, భవిష్యత్ ని ప్రశ్నార్థకం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైడ్రాకు విశేష అధికారాలు కల్పించబోతోంది.
హైడ్రా చట్టబద్దమైన సంస్థ అని చెప్పిన కమిషనర్ రంగనాథ్, అక్టోబర్ లోపు దీనికి సంబంధించి ఆర్డినెన్స్ వస్తుందన్నారు. త్వరలోనే హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయన్నారు. గ్రేహౌండ్స్, టాస్క్ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. రెండు వారాల తర్వాత హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఆలోగా ప్రభుత్వం హైడ్రాకు పక్కాగా అధికారాలు కట్టబెట్టేందుకు నిర్ణయించింది.