హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వినాయక విగ్రహాల నిమజ్జనాల్లో గందరగోళం జరిగింది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం వద్దంటూ పోలీసులు ఇటీవల బ్యారికేడ్లు పెట్టిన విషయం తెలిసిందే. ఎవరూ నిమజ్జనం చేయకుండా ఇనుప జాలీలు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు భాగ్య నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆ జాలీలు తొలగించారు. పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు. తమతోపాటు తెచ్చిన విగ్రహాలను ట్యాంక్ బండ్ పైనుంచే నిమజ్జనం చేశారు.
ఎందుకీ ఆంక్షలు..?
నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు ప్రభుత్వమే క్రేన్లు ఏర్పాటు చేసి నిమజ్జనానికి ఆటంకాలు లేకుండా చేస్తోంది. ఇటు ట్యాంక్ బండ్ ఏరియాలో మాత్రం నిమజ్జనాలకు అనుమతి లేదంటోంది. ఏ విగ్రహం అయినా హుస్సేన్ సాగర్ లోనే వేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా కొన్నిచోట్ల పూల్స్ ఏర్పాటు చేశారు. పెద్ద విగ్రహాలు మాత్రం హుస్సేన్ సాగర్ లోనే వేస్తుంటారు. అలాంటి సందర్భంలో ట్యాంక్ బండ్ పై మాత్రమే ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు. పోలీసుల బ్యారికేడ్లను తొలగించి వారు విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయని అంటున్నారు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు. 2022, 2023లో కూడా ఆంక్షలు విధించాలని చూశారని, చివరకు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి నిమజ్జనాలకు అనుమతులిచ్చారని గుర్తు చేశారు. ఈసారి కూడా నిబంధనలు పెట్టడం ఎందుకని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడి విగ్రహాలను అక్కడే మండపాల్లో ఉంచేస్తామని, హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.