కేసీఆర్ ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? కనీసం వరదల సమయంలో కూడా ప్రజల్ని పరామర్శించే తీరిక ఆయనకు లేదా..? కాంగ్రెస్ నుంచి ఘాటు విమర్శలు వినపడుతున్నాయి. ఈ దశలో కేసీఆర్ రీఎంట్రీకి ముహూర్తం దగ్గరపడిందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. వారం పదిరోజుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ అంతా స్ట్రీమ్ లైన్ అవుతుందని, కేసీఆర్ నిర్దేశించిన ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మీడియాకు కూడా కనపడ్డం లేదు. ఆమధ్య రైతుల పరామర్శకోసం బస్సుయాత్ర చేపట్టిన కేసీఆర్, ఆ తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ నేతల సంగతి తేలుస్తారంటూ ప్రచారం జరిగినా.. ఆయన రావడం, వెళ్లడం హడావిడి లేకుండానే జరిగిపోయింది. తీరా తెలంగాణ వరదల సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు, కనీసం వరద బాధితులకు ఆయన ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదు. దీంతో కాంగ్రెస్ ఆయన్ని టార్గెట్ చేసింది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. అరికెపూడి గాంధీ వ్యవహారంలో ఆ గొడవ మరింత పెరిగింది. ఒకరి ఇంటిపై మరొకరు దాడికి వెళ్లారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అప్పుడు కూడా కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. విదేశాలనుంచి తిరిగొచ్చిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీటి పెట్టి చిట్టినాయుడు, బుల్లెబ్బాయి అంటూ.. సెటైర్లు పేల్చారే కానీ.. సెటిలర్ ఎమ్మెల్యే అనే కామెంట్ కి మాత్రం సమాధానం ఇవ్వలేదు.
సిక్స్ గ్యారెంటీస్ అమలుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ వ్యూహాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఎన్నికల హామీల అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో బీఆర్ఎస్ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కాలేకపోతున్నారనే అపవాదు ఉంది. ప్రస్తుతం అరికెపూడి గాంధీ విషయంలో జరుగుతున్నది కూడా వ్యక్తిగత రాజకీయ పోరాటమే తప్ప అందులో ప్రజా ప్రయోజనాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ లో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజా ప్రతినిధులు, నాయకులతో కేసీఆర్ వారం పది రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాల సమాచారం.