హైదరాబాద్ లో ఇటీవల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ లు అమ్ముతున్నారంటూ అరికో కేఫ్ పై ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కేఫ్ లో తనిఖీలు చేసి విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ అమ్ముతున్నారని ఎక్సైజ్ పోలీసులు మీడియాకు చెప్పారు. ఇలాంటి ఐస్ క్రీమ్ లకు పిల్లల్ని, యూత్ ని బానిసలు చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఈ కేసు ఇప్పుడో కీలక మలుపు తిరిగింది. ఈ కేఫ్ ఓనర్ శరత్ చంద్రారెడ్డి ఎక్సైజ్ పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది..?
విస్కీ ఐస్ క్రీమ్ అనేది కేవలం కట్టుకథ అని కేఫ్ యజమానులు చెబుతున్నారు. వారు ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం లంచం కోసం ఎక్సైజ్ పోలీసులు తమని సంప్రదించారని, తాము కుదరదని చెప్పడంతో కక్షగట్టి ఇలా డ్రామాలాడారని అంటున్నారు. పదకొండున్నర కేజీల కేక్ ని ఎక్సైజ్ పోలీసులే ఆర్డర్ చేశారని, అందులో విస్కీ కలపాలని చెఫ్ దయాకర్ పై ఒత్తిడి తెచ్చారని, అతను ఒప్పుకోకపోవడంతో వాచ్ మన్ తాగి పడేసిన మందు బాటిళ్లు కేఫ్ లోకి తీసుకొచ్చి, రైడ్ లో అవి దొరికినట్టు డ్రామాలాడారని, తమపై కేసు పెట్టారని ఓనర్లు చెబుతున్నారు. ఓ పథకం ప్రకారం తమని ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వారు మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ని సాక్ష్యాలుగా చూపిస్తున్నారు కేఫ్ యజమానులు.
పోలీసులు చెప్పింది నిజమా, లేక కేఫ్ యజమానులు చెబుతున్నది నిజమా అనేది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. లంచం ఇవ్వకపోవడంతో ఎక్సైజ్ పోలీసులు తమపై కక్షగట్టారని కేఫ్ యజమానులు చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇదే పెద్ద ట్విస్ట్ అయింది.