తెలంగాణ సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. ఈ విగ్రహం విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయంలో మరోచోట ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గొడవ మొదలు పెట్టింది. తెలంగాణ తల్లిని అవమానిస్తారా ? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ? అంటూ కేటీఆర్ ట్వీట్ వేశారు.
https://x.com/KTRBRS/status/1835522950453198853
రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న చోట కేసీఆర్ విగ్రహం పెట్టాలని అనుకున్నారని, అది సాధ్యం కాకపోవడంతో వారు విలవిల్లాడిపోతున్నారని ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లిపై అంత ప్రేమ ఉంటే.. సచివాలయం కట్టినప్పుడే ఆ విగ్రహం ఎందుకు పెట్టలేదని ఆయన లాజిక్ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన, శంకుస్థాపన కూడా చేశారు. దీంతో తెలంగాణ మేధావులు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా కూడా, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం లోపల ఉండటం సరికాదనేది బీఆర్ఎస్ వాదన. తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని తీసిపడేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు, సవాళ్ల నేపథ్యంలో ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమాయత్తమవడం విశేషం.
వాస్తవానికి సెప్టెంబర్ 20 రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అక్కడ రాజీవ్ విగ్రహం వద్దంటూ తెలంగాణ నుంచి డిమాండ్లు వినపడుతున్న నేపథ్యంలో రాహుల్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ఇష్టపడలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలే విగ్రహావిష్కరణకు సిద్ధమయ్యారు. ఈరోజు విగ్రహావిష్కరణ వేళ, కేటీఆర్ ట్వీట్ తో మళ్లీ ఈ గొడవ మొదలైంది.