తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఉన్న వివాదం పోలీస్ స్టేషన్ల వరకు చేరింది. ఈ వ్యవహారంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వీపు చింతపండు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రీవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తనని హత్య చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, ఆయనే తన ఇంటిపైకి మనుషుల్ని పంపించారని మండిపడ్డారు.
https://x.com/BRSparty/status/1835567939497410666
తాను కేసీఆర్ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన గట్టిగా మాట్లాడుతున్నానని, బలంగా తన గళం వినిపిస్తున్నానని, అందుకే తనను హత్య చేయించాలనుకున్నారని అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని, నాలుగేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్లీ తెలంగాణలో ఎగురుతుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆరోజు ఏ ఒక్కర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పోలీసులకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటిపై దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న సీఐని, ఏసీపీని ఈ ప్రభుత్వం కాపాడినా, నాలుగేళ్ల తర్వాత మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తానన్నారు. ఓ దశలో పీసీసీ పదవికోసం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి మరీ తన కాళ్లు పట్టుకున్నారని అన్నారు కౌశిక్ రెడ్డి. ఆ విషయాలన్నీ ఆయన మరచిపోయారా అని ప్రశ్నించారు.
దమ్ముంటే పోలీసోళ్లని పక్కకి జరిపి తన ఇంటిపైకి రావాలని సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. పోలీస్ ప్రొటెక్షన్ తో రావడం సిగ్గు చేటన్నారు. పోలీసులు లేకుండా తన ఇంటికొస్తే ఎవరి వీపు చింతపండు అవుతుందో చూస్కుందామన్నారు. తాను తెలంగాణ ప్రజల కోసం చచ్చిపోడానికి కూడా సిద్ధం అని అన్నారు. రేవంత్ రెడ్డి చంపితే చచ్చిపోడానికి తాను రెడీగా ఉన్నానని అన్నారు కౌశిక్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రతిఘటన మొదలు పెట్టినా ఇప్పటి వరకు పెద్దగా ప్రయోజనం కనపడ్డంలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు మరింత హడావిడి పెంచారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాకౌట్ లు, ఘెరావ్ లు, చివరకు అరెస్ట్ ల వరకు సీన్ తీసుకొచ్చారు. ఇప్పుడు బహిరంగ సవాళ్లతో మరోసారి పార్టీ శ్రేణులను కౌశిక్ రెడ్డి వంటి నేతలు రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎమ్మెల్యే, సెటిలర్ ఎమ్మెల్యే అంటూ ప్రాంతీయ విభేదాలను కూడా బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా కౌశిక్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి అటునుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.