తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు తమపై దాడులకు తెగబడుతున్నారంటూ మరోసారి డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆమధ్య ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై ఫిర్యాదు చేసిన నేతలు, మరోసారి డీజీపీని కలసి కాంగ్రెస్ నేతలు తమని టార్గెట్ చేశారని ఆరోపించారు. వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, వివేకానంద గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. డీజీపీ జితేందర్ కి ఫిర్యాదు పత్రం అందించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల ఎదుటే.. కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు డీజీపీకి నాలుగుసార్లు ఫిర్యాదు చేశామని, కానీ ఫలితం లేదన్నారు. డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే మరోసారి వచ్చి ఆయనకు తమ ఫిర్యాదు గురించి గుర్తు చేశామన్నారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై చేసిన సవాల్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించి దాడులకు పాల్పడ్డారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడి చేసేందుకు బయల్దేరిన అరికెపూడి గాంధీని పోలీసులు నిలువరించలేకపోయారని.. వారి చర్యలతో రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట దిగజారిపోతోందన్నారు. కాంగ్రెస్ నాయకుల పుట్టినరోజు వేడుకలు పోలీస్ స్టేషన్‌లలో జరుపుకునే దౌర్భాగ్యం కాంగ్రెస్ పాలనలో నడుస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఉన్న హోదా రేవంత్ రెడ్డికి తెలియదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పోలీస్ డిపార్ట్‌మెంట్ భవిష్యత్తు కాపాడాలని, రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని డీజీపీని కోరామని తెలిపారు.