ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈనెల 27న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఈరోజు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కానీ జనం ఎక్కువైపోయారు. పరిమితికి మించి ఆడియన్స్ వచ్చేశారు. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. వీఐపీ గ్యాలరీలు కూడా ఫ్యాన్స్ తో నిండిపోయాయి. దీంతో తోపులాట జరిగింది. నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈ దశలో సడన్ గా ఓ ప్రకటన విడుదలైంది. దేవర ఈవెంట్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
దేవర ఈవెంట్ రద్దయిందని తెలియగానే ఫ్యాన్స్ మరింత రచ్చ చేశారు. ఓ దశలో హోటల్ అద్దాలు పగలగొట్టారు, కుర్చీలు విరగ్గొట్టారు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని వారించాలనుకున్నా సాధ్యం కాలేదు. హోటల్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం తెలపడంతో నిర్వాహకులు ఈవెంట్ రద్దు చేస్తున్నామని, ఫ్యాన్స్ అక్కడినుంచి వెళ్లిపోవాలని బతిమిలాడారు. అప్పటికే ఆ ప్రాంగణానికి చేరుకున్న దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ కూడా వెనక్కి వెళ్లిపోయారు. ఫ్యాన్స్ కూడా నిరాశతో వెనుదిరిగారు.
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దాదాపు రెండేన్నరేళ్లు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ లో కూడా ఈవెంట్లు జరిగాయి. హిందీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు హీరో ఎన్టీఆర్. తెలుగు ప్రమోషన్ మాత్రం గందరగోళంగా మారింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది.