తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిపించాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. మరోవైపు ఎలాగైనా అనర్హత వేటు నుంచి వారిని తప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తో కలుపుకోవడం లేదు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరికి ఏకంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. త్వరలో వీరి వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగా ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏపాల్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మరోసారి భయపెట్టారు. ఆయన పిటిషన్ తో తెలంగాణ హైకోర్టు 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. 10 మంది ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం అని, రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారుని కేఏపాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించడం అంటే రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. అయితే ఇప్పటికే ఇదే కేసులో తెలంగాణ స్పీకర్ కి హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కావడం విశేషం.