ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ప్రతిపక్ష టీడీపీకి చెందిన సభ్యులు ధరల పెరుగుదల అంశంపై చర్చకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించలేదు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. సభ నియమాలను అనుసరించి సదరు సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అంతకుముందు అధికార వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ “టీడీపీ సభ్యులకు సభ మర్యాదలు తెలియదు .సభ అంటే గౌరవం లేదు. సాక్షాత్తు గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినే ఓపిక సదరు సభ్యులకు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి కుర్చీపైకి.. మీపైకి విసిరేస్తారు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కుర్చీలను చూపిస్తూ సైగలు చేస్తూ తొడలు కొడతారు. ఇది సినిమా కాదు.. తొడలు కొడితే కుర్చీలు రావడానికి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేసి దీవిస్తేనే ఎమ్మెల్యే కుర్చీ అయిన సీఎం కుర్చీ అయిన వస్తాది. ఇంత చిన్న లాజిక్ తెల్వకుండా బాలకృష్ణ ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థంకావడంలేదు. ఇప్పటికైన ప్రజాస్వామ్య విలువ తెలుసుకోవాలని” సూచించారు. దీంతో సోషల్ మీడియాలో బాలకృష్ణపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. బాలయ్య ఇది బోయపాటి శీను సినిమా అనుకుంటున్నాడు.. అసెంబ్లీ అని ఎప్పుడు అనుకుంటారో.. సినిమాల్లో హీరో కానీ బాలయ్య అసెంబ్లీలో జీరో అని ట్రోల్స్ నడుస్తున్నాయి.