వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ వలంటీర్ల వ్యవస్థ కారణంగా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించింది. అంతేకాకుండా వారి ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు సవ్యంగా అందుతున్నాయి. ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఎండలో ముసలివారు సైతం క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. కానీ, ఈ వలంటీర్లు వచ్చిన తర్వాత ఆ శ్రమ తప్పింది. ఇంటి వద్దకే వారే స్వయంగా వచ్చి పింఛన్ మొత్తాన్ని అందిస్తున్నారు.
అలాంటి ఈ వ్యవస్థపై ఈనాడు రామోజీరావు.. మరోవైపు చంద్రబాబు తమ అక్కసు మొత్తం వెల్లగక్కుతున్నారు. వలంటీర్లు చేయని మోసం, అకృత్యాలు లేవంటూ ఈనాడు దుమ్మెత్తిపోసింది. వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ఆ వ్యవస్థపై చంద్రబాబు విమర్శలు చేస్తుండటం గమనార్హం.
నిజానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ వలంటీర్ వ్యవస్థే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే.. దానిని ఓ పనికి రానిదిగా నిరూపించాలని రామోజీరావు, చంద్రబాబు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంత మేరకు వలంటీర్లను నైతికంగా దెబ్బ తీయాలనే పట్టుదలతో అబద్ధాలు గుప్పించడానికి సిద్ధపడ్డారు. గతంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా వలంటీర్ల మీద విరుచుకుపడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు.
గ్రామ వలంటీర్ల నియామకం ద్వారా జగన్ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజలకు సేవలు చేసే ఒక పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఓర్వలేని చంద్రబాబు, రామోజీ రావు ఆ వ్యవస్థను దెబ్బ తీయాలని కంకణం కట్టుకున్నారు. ఏ వ్యవస్థలోనైనా కొద్ది మంది అనైతిక కార్యకలాపాలకు, మోసాలకు, నేరాలకు పాల్పడవచ్చు. కొద్దో గొప్పో.. అవినీతిపరులు లేని వ్యవస్థ ఏదీ లేదు. బియ్యంలో ఒక్క పురుగు వచ్చిందని.. బియ్యం మొత్తం తప్పు అనలేం కదా.. ఆ పురుగును మాత్రమే ఏరిపారేస్తాం. అదేవిధంగా ఎవరైనా వలంటీర్లు అనైతిక చర్యలకు పాల్పడితే.. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు రెండున్నర లక్షల మంది వలంటీర్లలో ఎవరో ఒకరు తప్పు చేస్తే దాన్ని వ్యవస్థకే అంటగట్టడం కచ్చితంగా అనైతికమే.
వలంటీర్లు వైసీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు తెగ ఆరోపిస్తున్నారు. కానీ, నిజానికి ఆ వలంటీర్లు వారి సేవలను మాత్రమే అందిస్తున్నారు. అసలు వారు వారి పని సవ్యంగా చేసుకుంటే చాలు అది జగన్‌కి అనుకూలంగానే మారుతుంది. ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తులుగా మారాల్సిన అవసరం లేదు. వాళ్లు సరిగా పని చేస్తున్నారనే వీళ్ల బాధంతా.. అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.