బీజేపీ, జనసేనతో పొత్తుల మాట ఎలా ఉన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం స్థానం మాత్రం టీడీపీకి తలనొప్పిగానే మారింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం దాదాపు ఖాయమైపోయిందంటున్నారు. అదే జరిగితే వసంతకు ఇక్కడ టీడీపీ టికెట్ ఇస్తారు. ఇది టీడీపీ సీనియర్ నేత, ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమాకు ఎసరు పెట్టే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమాను ఒప్పించి పెనమలూరుకు పంపాలని చంద్రబాబు లెక్కలేస్తున్నారు.
మిగిలిన స్థానాలన్నింటికీ ఖరారైనా ఈ రెండే పెండింగ్
విజయవాడ పశ్చిమ స్థానాన్ని జనసేనకు ఇవ్వడం దాదాపు ఖరారయింది. మిగిలిన స్థానాలన్నింటికీ అభ్యర్థులు ఖరారయిపోయినట్లే. కానీ మైలవరంలో వసంతా, దేవినేనా తేల్చుకోలేక దాన్ని పక్కనపెట్టారు. ఆ స్థానంలో ఇద్దరిలో ఒకరిని నిలబెడితే మరొకరిని పెనమలూరులో పోటీ చేయించాలని బాబు ఆలోచన. అయితే తాను పార్టీలో సీనియర్‌ను కాబట్టి టికెట్ తనకే ఇవ్వాలని ఉమా పట్టుబడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి తనకు టికెట్‌పై హామీ ఇచ్చారని వసంత అంటున్నారు.
బోడే ప్రసాద్ మాటేంటి?
ఒకవేళ ఈ సర్దుబాటుకు వీరిద్దరూ అంగీకరించినా పెనమలూరులో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాటేంటి అనేది ఇప్పుడు ప్రశ్న. వాళ్లెవరి కోసమో తానెందుకు టికెట్ త్యాగం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఒక నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తమ పార్టీలోకి వస్తున్నారనే సంబరం టీడీపీకి ఈ సీట్ల సర్దుబాటు తలనొప్పులతో ఆవిరైపోతోంది.