తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. అలాంటి టీడీపీకి ఇప్పుడు ఘోర పరాభవం జరిగింది. ఈ ఘనత మొత్తం చంద్రబాబు(chandrababu) నాయుడుకే దక్కుతుంది. టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితిలో టీడీపీ లేదు. టీడీపీ ఏకైక రాజ్యసభ(rajya sabha) సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒక్కటి కూడా గెలిచే అవకాశం టీడీపీకి లేదు.
ఎన్నికలు జరిగే మూడు స్థానాలను కూడా వైసీపీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కోటా 11. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఇద్దరు, టీడీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభా స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 23 స్థానాలను గెలుచుకుంది.
చంద్రబాబు పలు కేసులను ఎదుర్కుంటున్నారు. ఈ కేసుల నుంచి బయటపడడానికి ఆయన తన పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేశ్‌లను బిజెపిలోకి పంపించారు. కనకమేడల ఒక్కరే టీడీపీలో ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఒక రాజ్యసభ సీటును గెలుచుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ లెక్కన టీడీపీకి కొత్తగా రాజ్యసభ సీటు దక్కడం కష్టమే. ఈ రాజ్యసభ ఎన్నికలు ఏపీలో ఫిబ్రవరి 27న జరగనున్నాయి.
ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలంతో వైసీపీ మూడు స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకునే పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాస్ రావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దాంతో టీడీపీకి 22 మంది సభ్యుల బలం ఉంది. అయితే, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీకి కొన్ని ఆశలు లేకపోలేవు. వైసీపీ అసంతృప్తులు, టికెట్ ఆశించి భంగపడ్డవారు పెద్ద ఎత్తున తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అది కూడా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.