టాలీవుడ్ అగ్రహీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. దీంతో నాగార్జున కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్- కన్వెన్షన్ కూల్చేశారని పిటిషన్ వేశారు. కూల్చివేతలు ఆపాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఫేమస్ పర్సనాలిటీ నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయడంపై ఏపీలో సరికొత్త చర్చకు దారి తీసింది. ఉండవల్లి కరకట్టపై గల ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అక్రమంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటున్నారని గత ప్రభుత్వం అనేక సార్లు ఆరోపించింది. ఆ నివాసం లింగమనేనికి చెందినదని, టీడీపీ 2014-19 వరకు అధికారంలో ఉండగా నెలకు రూ.2 లక్షల అద్దె చెల్లించిందని అప్పటి అధికార వైసీపీ ఆరోపించింది.
కాగా, నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధన ఉంది. అయినప్పటికీ అక్రమంగా లింగమనేని రమేష్ ఇల్లు నిర్మించుకొని దానిని చంద్రబాబుకు ఇచ్చారని చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) లింగమనేని రమేష్‌ను ఏడు రోజుల్లోగా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని, లేనిపక్షంలో APCRDA ఆ పనిచేస్తుందని హెచ్చరించింది. ఉండవల్లి కరకట్టపై గల ఇంటి వద్ద చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో APCRDA కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వును ఆ ఇంటికి అతికించారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో జరిగిన నాగార్జున ఇన్సిడెంట్‌కు చంద్రబాబు కరకట్ట నివాసానికి ముడిపెడుతూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అధికారంలో ఉండి, అందులోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే అక్రమ కట్టడంలో నివాసంలో ఉంటున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తనకంటూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.