లైంగిక వేధింపులపై మీడియా ముందు మాట్లాడొద్దంటూ సినీ నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా సినీ రంగానికి చెందినవారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు నటీమణులు ధైర్యంగా బయటికొచ్చి మీడియా ముందు తమకు ఎదురైన వేధింపుల గురించి వెల్లడిస్తున్నారు. తమ సమస్యలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి రోహిణి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఆదివారం జరిగిన నడిగర్ సంఘ సమావేశంలో పాల్గొన్న నటి రోహిణి హేమ కమిటీ నివేదికనుద్దేశించి మాట్లాడారు.
దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదికను సిద్ధం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను మీడియా ముందుకు వచ్చి బయటపెట్టగా.. ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్, నటుడు జయసూర్య, మణియన్ పిళ్ల రాజులపై కేసులు నమోదయ్యాయి.